గృహంలో పూజామందిరం ఏ దిశలో ఉత్తమం

SMTV Desk 2017-12-01 18:31:22  Pujamandiram, Architecture

హైదరాబాద్, డిసెంబర్ 01 : గృహ నిర్మాణం బట్టే ఆ స్థానంలో నివసించే వారి భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా పూజాగది విషయంలోనూ కొన్ని నిర్దిష్టమైన సూచనలు ఉన్నాయి. ఇంటిలో ఈశాన్య దిక్కులో పూజ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు, ఉత్తరదిక్కుల మధ్య ఉన్న ప్రాంతమే ఈశాన్యం కాబట్టి, పూజ గది నిర్మాణానికి ఇదే అత్యుత్తమైన స్థానం. ఈ గదిలో ఉదయాన్నే సూర్యకిరణాలు ప్రసరించడం మూలంగా అక్కడ చేసే ధ్యానం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. ఆ స్థానంలో పూజ చేసుకునేవారు తూర్పు లేదా ఉత్తర దిక్కులకు తిరిగి కూర్చోవడం మంచిది. అంటే దైవాన్ని పడమటివైపు కానీ, దక్షిణం వైపు కానీ ఉండేలా అమర్చుకోవాలి. ఇంటివైశాల్యాన్ని బట్టి వీలు లేకపోతే అల్మరా వంటిది పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా వీలుకాకపోతే, కనీసం ఒక్క ప్రతిమ లేదా ఫొటో అయినా ఈశాన్య దిక్కున ఉంచుకోవాలి. ఇక పూజగదికి తప్పనిసరిగా గడప ఉండాలి. గంటలతో తలుపును ఏర్పాటచేస్తే మంచిది. నైరుతి, ఆగ్నేయ మూలల్లో పూజగదులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. బెడ్‌రూం ద్వారా పూజా మందిరానికి దారి ఉండకుండా చూసుకోవడం ఉత్తమం.