రేవంత్ ను అందుకే టీఆర్ఎస్ లోకి తీసుకోలేదు: తలసాని

SMTV Desk 2017-12-01 17:20:30  talasani srinivas yadav, revanth, trs ,joining, kodangal

మహబూబ్‌నగర్, డిసెంబర్ 01: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తేదేపా నుండి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ లో చేరక ముందు ఆయన తెరాసలో చేరదామనుకున్నారట. ఈ విషయం స్వయంగా తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, తలసాని మంచి మిత్రులు. ఈ సాన్నిహిత్యంతో తొలుత రేవంత్ తెరాసలో చేరటానికి తలసానిని సంప్రదించారని తెలిపారు. దీనిని పాలమూరు జిల్లా నేతల వద్ద ప్రస్తావిస్తే ఓటుకు నోటు కేసులో దొరికిన ఆయన్ను తీసుకుంటే టీఆర్ఎస్ పరువు పోతుందని వారు వద్దనడం, రేవంత్ చేరికకు కేసీఆర్ కూడా విముఖత చూపడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ గడప తొక్కాడని ఆయన విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ ఇప్పుడు ఏం చెబుతారని తలసాని అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డితో కలిసి తలసాని ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్ తోనే సాధ్యమని తలసాని ఉద్గాటించారు.