బీజేపీ పాలనకు వందేళ్లు అవకాశం ఇవ్వండి: మోదీ

SMTV Desk 2017-11-30 19:32:28  modi, gujarath elections, 100 years

మోర్బీ, నవంబర్ 30: గుజరాత్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఓ పక్కా మోదీ, మరోపక్క రాహుల్ సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. మోదీ సొ౦త రాష్ట్రం కావడం, ప్రధాని అయ్యాక రాష్ట్రంలో తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం, పటేళ్ళు కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో ఈ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మక౦గా తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సౌరాష్ట్ర ప్రాంతంలోని పటీదార్లకు పట్టున్న మోర్బీ పట్టణంలో మోదీ బుధవారం ఓ ర్యాలీలో ప్రసంగించారు. 22 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలోనే ఉన్న తమ పార్టీ నర్మదా నది నుంచి కరువు ప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్‌లకు పైపులైన్లు నిర్మించి, అక్కడి ఆనకట్టలు నింపి నీరు అందించి ఎంతో మంచి చేసిందన్నారు. గుజరాత్ లో ప్రజలకోసం మంచి చేయడానికి ప్రయత్నించినవారిని గౌరవించడం ఈ భూమి సంప్రదాయమని, గుజరాత్ కు తాము ఎంతో చేశాం అని ఆయన అన్నారు. మరో 100 ఏళ్లపాటు ప్రజలు బీజేపీకే ఓటేసి అధికారమివ్వాలని ఆయన ఓటర్లను కోరారు. కాగా డిసెంబర్ 9న గుజరాత్ లో తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి.