శబరిమలలో 13 గంటల పాటు దర్శనం నిలిపివేత

SMTV Desk 2017-11-30 18:18:42  Okky storm effect, shabarimalai temple close

కేరళ, నవంబర్ 30 : ఓక్కీ తుఫాను ప్రభావంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమలకు వెళ్లే రహదారులు మూసివేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళ, తమిళనాడు తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కన్యాకుమారి సహా పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. అంతేకాకుండా ఈదురు గాలుల వలన విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. దీంతో శబరిమల ఆలయంలో గురువారం సాయంత్రం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 7గంటల వరకు దర్శనం నిలిపివేశారు. అక్కడి అధికారులు కూడా యాత్రికులకు హెచ్చరికలు జారీ చేశారు. సన్నిధానం, పంబ వద్ద ఉన్న భక్తులు సిబ్బందిని సంప్రదించి సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని సూచించారు. చెట్ల వద్ద, పల్లపు ప్రాంతాల్లో ఉండరాదని, నదులు, సరస్సులో స్నానాలు చేయవద్దని వెల్లడించారు. అధికారులు ఆంక్షలు ఎత్తివేసే వరకు అటవీ మార్గం గుండా వెళ్లకూడదని భక్తులను కోరారు.