మీరాబాయి చానును ప్రశంసించిన రాష్ట్రపతి కోవింద్

SMTV Desk 2017-11-30 16:00:40  Weightlifting competition, Mirabai Chanu, President Rama Nath, Admiration

న్యూఢిల్లీ, నవంబర్ 30 : ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో సరికొత్త రికార్డును నెలకొల్పిన మీరాబాయి చానును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించారు. దేశానికి ప‌సిడి ప‌త‌కాన్ని తెచ్చిపెట్టిన ఆమె క్రీడాస్ఫూర్తిని ఆయన కొనియాడారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణం సాధించిన చానుకు రామనాథ్ అభినందనలు తెలిపారు. అలాగే, అద్భుతమైన మహిళా క్రీడాకారిణిని ఈ దేశానికి అందించిన మణిపూర్‌ రాష్ట్రాన్ని అభినందించారు. రైల్వే అధికారిణి అయిన 23 ఏళ్ల చాను 48 కిలోల విభాగంలో మొత్తం 194 కిలోలు లిఫ్టింగ్‌ ఎత్తి, సరికొత్త రికార్డు నెలకొల్పారు. కాలిఫోర్నియాలోని అనాహిమ్‌లో జరుగుతోన్న ఈ ప్రపంచస్థాయి పోటీల్లో చాను పాల్గొని, ఒలింపిక్స్‌లో రజత పతకం విజేత కరణం మల్లీశ్వరి తర్వాత ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన రెండో భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. 1994, 1995లో కరణం మల్లీశ్వరి స్వర్ణం దక్కించుకుని దేశానికి గుర్తింపు, తేగా, ఇప్పుడు చాను ప్రతిభతో మరోసారి భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.