దేశాభివృద్ధికి రైతు అభివృద్ధి కీలకం: సీఎ౦ కేసీఆర్

SMTV Desk 2017-11-30 10:58:29  kcr, neeti ayog, rajeev kumar, pragathi bhavan, former

హైదరాబాద్, నవంబర్ 30: రైతు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తాము నమ్ముతున్నామని, ఈ మేరకు రైతులు అభివృద్ధి చెందేదిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్, సభ్యులు రమేశ్‌చందర్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ముఖ్యంగా వ్యవసాయాభివృద్ధికి చేపడుతున్న చర్యలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. రాష్ట్రంలో సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే మిషన్ కాకతీయద్వారా చెరువుల పూడిక తీశామని, ఈ కార్యక్రమం చివరిదశ కొనసాగుతున్నదని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు భారీ ఎత్తున నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలని సీఎం కేసీఆర్ నీతిఆయోగ్ వైస్ చైర్మన్‌ను కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రూ.లక్ష వరకు రైతులకు రుణమాఫీ చేశామని, ఇప్పటివరకు వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా చేశామని, 2018 జనవరి నుంచి వ్యవసాయానికి 24 గంటల నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. రైతుకు ఆర్థికంగా భరోసా కల్పించాలని నిర్ణయించి, వచ్చే వానాకాలం సీజన్ నుంచి సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.8 వేల పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చెప్పారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి దళారుల చేతికి వెళ్లకుండా భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నామని సీఎం వారికి వివరించారు. ఈ సందర్భంగా 2017 సంవత్సర స్టాటిస్టికల్ పుస్తకాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్‌తో కలిసి సీఎం ఆవిష్కరించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నించాలని నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు.