చరిత్ర తిరగరాసిన బిట్ కాయిన్

SMTV Desk 2017-11-29 14:57:17  bitcoin, black chain system, virtual currency, 10,000 dollars mark

సింగపూర్, నవంబర్ 29 : ఎవరు సృష్టించారో తెలియదు...? అసలు ఏ దేశ కరెన్సీ అంటే సమాధానంలేదు...? కానీ చరిత్రను తిరగరాసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదేశానికి చెందని అంతర్జాతీయ ఊహాజనిత ద్రవ్యము. ఈ బిట్ కాయిన్.. మంగళవారం జరిగిన ట్రేడింగ్ లో డిజిటల్‌ కరెన్సీ ఆసియా మార్కెట్‌లో, తొలిసారి 10,000 డాలర్ల మార్కును అధిగమించి ముందుకెళ్లింది. బిట్ కాయిన్ అనేది ఏ దేశానికి చెందని ఒక అంతర్జాతీయ కరెన్సీ. 2009 సంవత్సరం జనవరి 3 న ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఒక భారీ నెట్‌వర్క్‌గా ఏర్పడిన కంప్యూటర్ల ద్వారా (బ్లాక్‌చెయిన్) సంక్లిష్టమైన గణిత శాస్త్ర సమీకరణాలతో బిట్ కాయిన్లను సృష్టిస్తారు. మొత్తం బిట్‌కాయిన్ల సంఖ్య 2.1 కోట్లకు మించకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఆన్‌లైన్‌ అమ్మకాలు, కొనుగోలుకు వీటిని వాడుతున్నారు. అయితే ఈ బిట్‌కాయిన్లు సైబర్‌ నేరగాళ్లకూ వరంగా మారాయి. ఇటీవల ప్రపంచాన్ని గడగడలాడించిన ‘వన్నా క్రై’, రాన్‌సమ్‌వేర్‌ వంటి హ్యాకర్లు కంప్యూటర్లలోని విలువైన సమాచారాన్ని చోరీ చేసి, అది తిరిగి పొందాలంటే డబ్బులను బిట్‌ కాయిన్ల రూపంలోనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎందుకంటే ఇందులో జరిగే లావాదేవీలను ట్రాక్ చేయడం చాలా కష్టం. ఎంతైనా ఇది అదృశ్య కరెన్సీ (వర్చువల్‌ కరెన్సీ) కనుక డాట్‌కామ్‌ బుడగ లాగా కుప్పకూలిపోతుందా అని కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.