ఫలించని జగన్ కోరిక !

SMTV Desk 2017-06-14 13:33:19  Andhra Pradesh High court,Krishna District,Nandigama Villagae,Justice shankarnarayana,Jaganmohanreddy

హైదరాబాద్, జూన్ 14 : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో అతను ఆశించిన ఫలితం దక్కలేదు. కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని జగన్ తో పాటు అతని వర్గీయులు దాఖలు చేసిన వ్యాజ్యాల్ని మంగళవారం రోజున హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శంకర్ నారాయణ విచారించి, వాటిని కొట్టి వేస్తున్నట్లు తీర్పునిచ్చారు. ఫిబ్రవరిలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృత దేహాలకు కృష్ణా జిల్లా నందిగామ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం నిర్వహించే సమయంలో, వైద్యులతో దుర్భాషలాడారనే ఆరోపణలతో జగన్ తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని కొట్టివేయాలంటూ జగన్, జోగి రమేష్ లు హైకోర్టుకు మనవి చేశారు. ఘటన జరిగిన రోజు జగన్ విలేకరులతో సంభాషించిన దృశ్యాలను సాక్ష్యంగా పరిగణించి, ఆయన చేసిన వినతిని తోసిపుచ్చాలని ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు గతంలో వాదనలు వినిపించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వ్యాజాలను కొట్టి వేశారు. ఈ కేసు విషయంలో పోలీసులు సీఆర్ పీసీ సెక్షన్ 41(ఏ) ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేశారు. అభియోగపత్రం దాఖలయ్యాక పిటిషనర్ లకు అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు.