ఐఎస్‌పీలకు షాక్ ఇచ్చిన ట్రాయ్‌

SMTV Desk 2017-11-29 10:36:46  trai, net neutrality, isp, internet speed

న్యూఢిల్లీ, నవంబర్ 29 : ప్రస్తుత సాంకేతిక యుగంలో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అవసరంగా మారింది. అయితే కొన్ని వెబ్ సైట్ లు వేగంగా, మరికొన్ని నెమ్మదిగా బ్రౌజ్ అవుతున్నాయి. ఇక నుండి అన్నింటిని సమాన వేగంతో బ్రౌజ్‌ చేసుకునే వీలును ఇంటర్నెట్‌ సేవాసంస్థలు (ఐఎస్‌పీ) కల్పించాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సూచించింది. అన్ని వెబ్‌సైట్‌లు, యాప్‌లకు ఇంటర్నెట్‌ వేగం సమానంగా ఉండాలని, కొన్నింటిపై ఆపేక్ష, మరికొన్నింటిపై వివక్షను అనుమతించవద్దని ట్రాయ్‌ సిఫారసు చేసింది. ‘నియంత్రణ లేకుండా ఇంటర్నెట్‌లోని కంటెంట్‌ మొత్తానికి అనుసంధానం అయ్యేలా ప్రస్తుత లైసెన్సింగ్‌ విధానాన్ని అమలు చేయాలి’ అని కోరింది. ట్రాయ్‌ సిఫారసులు కనుక అమల్లోకి వస్తే, ఐఎస్‌పీల జోరుకు అడ్డుకట్టపడుతుంది. అంతే కాకుండా ఇంటర్నెట్‌లో వేర్వేరు సేవలు, కంటెంట్‌ను భిన్న వేగంతో బ్రౌజ్‌ చేసేలా చర్యలు చేపట్టడం టెలికాం సంస్థలకు వీలవదు. ఆన్‌లైన్‌ వీడియోలు చూడకుండా వేగాన్ని తగ్గించే చర్యలు చేపట్టలేరు. ఇంటర్నెట్‌ ఆధారిత కంటెంట్‌కు ఎటువంటి వివక్ష లేకుండా చేరే అవకాశం కల్పించేలా లైసెన్స్‌ నిబంధనలు సవరించాలని ట్రాయ్‌ సూచించింది. వేర్వేరు ధరలకు అనుగుణంగా నెట్‌ వేగాన్ని అందించడాన్ని గతేడాది ట్రాయ్‌ నిషేధించిన సంగతి తెలిసిందే.