విద్యుత్ బకాయిలపై న్యాయ పోరాటం చేయండి: బాబు

SMTV Desk 2017-06-14 12:32:28  TS,AP,Goverment,CM Chandrababu,TSGENCO,APGENCo

అమరావతి, జూన్‌ 14 : గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిలపై సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాలు వాటిని చెల్లించాలని పరస్పరం నోటీసులను ఇచ్చుకున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "కొరత అధికంగా ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ విద్యుత్తును తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకుంది". ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ధర తగ్గేసరికి.. మా విద్యుత్ అవసరం లేదన్నట్లుగా మాట్లాడడమే కాకుండా.. బకాయిలను చెల్లించకపోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి రాబోయే బకాయిలను వసూలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఏపీ జెన్ కో అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అవసరమైతే విద్యుత్ బకాయిల గురించి కేంద్రానికి, కేంద్ర ఇంధన సంస్థలు , తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేయండి’ అని ఇంధన శాఖ అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా సాంకేతిక కారణాలతో పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే.. ఆ సమయానికి ఆయా పరిశ్రమలకు డిస్కమ్‌లు అపరాధ రుసుము చెల్లించాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం.. తెలంగాణ నుంచి బకాయిల వసూలుకు కేంద్ర పెద్దలతో సంప్రదింపులు చేపట్టాలని.. అప్పటికీ ఫలితం లేకుంటే న్యాయపోరాటం చేయాలని ఇంధన శాఖ భావిస్తోంది.