హైదరాబాద్ ముత్యాల నగరం : ఇవాంకా

SMTV Desk 2017-11-28 18:07:59  ivanka trump speech, HICC ges meeting in hyderabad,

హైదరాబాద్, నవంబర్ 28 : నగరంలోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఘనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రారంభం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు జల్లు కురిపించారు. "150 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు శుభాకాంక్షలు. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి. కొత్త ఆవిష్కరణలకు ముందుకొస్తున్న యువతకు స్వాగతం. ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోంది. భారత్‌ అమెరికాకు నిజమైన మిత్ర దేశం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతుంటారు. ముత్యాల నగరంలో యువతే గొప్ప సంపద. పారిశ్రామిక వేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య 10శాతం పెరిగింది. ఇప్పుడు అమెరికాలో కోటీ 10 లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు, సాంకేతికత, సహాయ సహకారాలు అందించాలి" అని వివరించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రస్తావిస్తూ.. టీ అమ్మే స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన మీ ప్రస్థానం భారతీయ నిపుణులకు స్ఫూర్తిదాయకమన్నారు. మహిళా సాధికారిత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్న మోదీకి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.