ఫేస్‌బుక్‌ ను వేదిక చేసుకున్న ఎన్నికల సంఘం

SMTV Desk 2017-11-28 17:08:40  face book, elections, The right to vote

న్యూఢిల్లీ, నవంబర్ 28 : ఫేస్ బుక్ ఖాతా కలిగిన యువతకు 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలనే సందేశాన్ని సదరు ఖాతాదారుని ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌పై ప్రత్యక్షమవనుంది. 2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రచారాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో యువత ఎక్కువగా సమయం కేటాయించే సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకొని ఆ సంస్థతో ఎన్నికల సంఘం చేతులు కలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటి నుంచి డిసెంబర్‌ 31 లోపు 18 ఏళ్లు నిండిన వారందరికి, జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఓటరుగా నమోదు చేసుకోవాలని సందేశం రానుంది. ఈ ఏడాది ఇప్పటికే 18ఏళ్లు పూర్తి చేసుకొన్న, పైబడిన వారందరికి ఈనెల 30న ఇదే సందేశాన్ని మరోసారి గుర్తుచేయనుంది. ఈ సమాచారాన్ని ఖాతాదారులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మెసేజ్‌లో ‘ ఇప్పుడే రిజస్టర్‌ చేసుకోండి’ అనే బటన్‌ కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేయగానే నేషనల్‌ ఓటర్స్‌ సర్వీసెస్‌ పోర్టల్‌కు అనుసంధానం అవుతుంది.