ప్రభుత్వానికి నష్టం జరుగలేదు : కెసిఆర్

SMTV Desk 2017-06-14 11:16:06  Dealing with land registrations, Convicts, cm kcr, cbi

హైదరాబాద్, జూన్ 14 : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మియాపూర్‌, బాలానగర్‌, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో తప్పుడు భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా శిక్షించి తీరుతామని సీఎం స్పష్టంచేశారు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడిన కొందరిపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ అంశంపై పోలీసు విచారణ జరుగుతున్నందున సీబీఐ దర్యాప్తు కోరాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టంచేశారు. జాగీరు భూములు రద్దయినప్పటికీ ఇంకా వాటిపై హక్కులున్నాయంటూ పత్రాలు సృష్టించుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి కొంతమంది సబ్‌రిజిస్ట్రార్లు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదని హెచ్చరిస్తూ, జాగీరు భూములపై ప్రభుత్వానికే తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులుండవని స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఏమాత్రం నష్టం జరగలేదని, భూమి అన్యాక్రాంతం కాలేదన్నారు. ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌లో ఇటీవల వెలుగు చూసిన అంశాలపై సీఎం మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మియాపూర్‌, బాలానగర్‌, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిపై హక్కులు పొందడానికి సబ్‌రిజిస్ట్రార్ల సహకారంతో జరిగిన దందాపై ఆయన విస్తృతంగా చర్చించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ ఆర్‌ మీనా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, స్టాంపు, రిజిస్ట్రేషన్ల కమిషనర్‌ అహ్మద్‌ నదీం, డీజీపీ అనురాగ్‌శర్మ, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు, ఇంటలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సందీప్‌ శాండిల్య, సీఎంవో అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. మియాపూర్‌, బాలానగర్‌, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో జాగీరు భూములపై హక్కులు పొందడానికి కొంతమంది చేసిన ప్రయత్నం వల్ల ఖజానాకు ఒక్క రూపాయి కూడా నష్టం కలుగలేదు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ వ్యవహారంలో కుంభకోణమే జరగలేదు. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొంతమంది అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొంతమందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేశాం. పాత జాగీరు భూములపై హక్కులు పొందడానికి జీపీఏలు సృష్టించి కోర్టు కేసుల్లో బలం చేకూరడానికి తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, దీనికి అవసరమైన విధానాన్ని రూపొందించాలన్నారు. జాగీరు భూములపై హక్కు పత్రాలను సృష్టించుకొని ప్రభుత్వ భూములను కాజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అన్ని కోణాల నుంచి ఎదుర్కోవాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కేసులు నడుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకు పూర్తి వివరాలు అందించాలని సూచించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి నేరుగా వివరాలు పంపి కేసు విచారణ సందర్భంగా పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకునేలా వ్యవహరించాలని ఆదేశించారు.