భారీ అగ్ని ప్రమాదం..

SMTV Desk 2017-06-14 11:13:24  West London,Loncasterwest estate,Lateemar road,Apartment,Fire engine

లండన్, జూన్ 14 ‌: పశ్చిమ లండన్‌లోని లాన్‌కస్టర్‌వెస్ట్‌ ఎస్టేట్‌ ప్రాంతంలోని లాటిమర్‌ రోడ్‌లో ఉన్న 27 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన జరిగిన ప్రదేశానికి 40 అగ్నిమాపక శకటాలను తరలించారు. వీటి సాయంతో 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. ఆ భవనంలో 120 ఫ్లాట్స్‌ ఉన్నాయి. భవంతిలోని రెండో అంతస్తు నుంచి 27వ అంతస్తు వరకూ మంటలు ఎక్కువగా వ్యాపించడంతో, మంటల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు తక్షణమే చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. క్షతగాత్రులను వైద్యశాలకు తీసుకెళ్ళడానికి తగిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని సిటీ మెట్రోపాలిటన్‌ పోలీసు, లండన్‌ అంబులెన్స్‌ సర్వీసు విభాగాలు ట్విటర్‌ ఖాతాలో వెల్లడించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదంతో భవంతిలోని అన్ని అంతస్తుల్లోకి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదం కారణంగా 27 అంతస్తుల ఆ భారీ భవనం ఏ సమయంలోనైనా కూలే ప్రమాదం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనను భారీ ప్రమాదంగా లండన్‌ మేయర్‌ సాదిఖ్‌ ఖాన్‌ ప్రకటించారు. అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.