ఈ నెల 29న ఆర్కేనగర్ అభ్యర్ధి ఎంపిక

SMTV Desk 2017-11-28 10:39:04  Arkenagar by election, The headquarters of AIADMK, chenai

చెన్నై, నవంబర్ 28 : మాజీ ముఖ్యమంత్రి జయ లలిత, విశాలక్ష్మి నెడుంజెళియన్‌ మృతితో పాలకమండలి సభ్యుల్లో ఇద్దరు తగ్గిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీచేసేందుకు ఆర్కేనగర్ ఉప ఎన్నికలు డిసెంబర్ 21 న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక జరగనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అన్నాడీఎంకే పాలకమండలి సోమవారం ఉదయం సమావేశమైంది. ఇప్పటివరకు ఏడుగురు సభ్యులు ఉండేవారు. వారిలో జయలలిత, విశాలక్షి నెడుంజెళియన్‌ మరణించిన నేపథ్యంలో మిగతా అయిదుగురు సభ్యులతో తొలుత సమావేశం మొదలైంది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని పాలక మండలికి ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. అదనంగా మరో ఇద్దరి కోసం సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎంపిక ఖరారు కాగా, మరో ముగ్గురు సభ్యుల ఎంపికపై కసరత్తు జరిగింది. మాజీ మంత్రులు వళర్మతి, వైద్యలింగం తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే దీనికి కొందరు నిర్వాహకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేయడంతో కొద్దిసేపు సమావేశంలో కలకలం చోటుచేసుకుంది. నిర్వాహకులకు ముఖ్యమంత్రి సర్దిచెప్పారు. ఎట్టకేలకు వళర్మతి, కేపీ మునుస్వామి, వైద్యలింగానికి సభ్యులుగా అవకాశం లభించింది. చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కన్వీనరైన ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, కో-కన్వీనరైన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా కన్వీనర్లు, మాజీ మంత్రులు, పార్టీ ప్రధానకార్యాలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.