గుజరాత్ నా ఆత్మ.. భారత్ నా పరమాత్మ: మోదీ

SMTV Desk 2017-11-27 17:25:58  modi, gujarath, elections, tea, speach

రాజ్ కోట్, నవంబర్ 27 : గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అదొక నీతి, నియమ, నేత లేని పార్టీ అన్నారు. తనపై బురద జల్లినందుకు సంతోషమని, ఎందుకంటే కమలం బురదలోనే వికసిస్తుందని కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. పదవి కోసం ఇక్కడ లేమని, ఇండియాను అత్యున్నత శిఖరాలకు చేర్చడమే తన లక్ష్యమని మోదీ స్పష్టంచేశారు. గుజరాత్ తన ఆత్మ అయితే.. భారత్ పరమాత్మ అని అన్నారు. 2008లో ముంబై దాడులు, తర్వాత ఉరి దాడి జరిగింది. ఈ రెండు దాడుల తర్వాత ఏ ప్రభుత్వం ఎలా స్పందించిందో చూస్తే కాంగ్రెస్ గురించి మీకు తెలిసిపోతుంది. గత 15 ఏళ్లలో తాను సాధించిందంతా గుజరాత్ వల్లే సాధ్యమైందని మోదీ స్పష్టంచేశారు. సర్దార్ పటేల్‌ను కాంగ్రెస్ అవమానించినా గుజరాత్ ప్రజలు భరించారు. ఇక వాళ్ల ఆత్మ గౌరవంపై దాడిని ఏమాత్రం సహించలేరు అని అన్నారు. గుజరాత్ ఎప్పటికీ కాంగ్రెస్‌ను క్షమించదని ఆయన తేల్చి చెప్పారు. ఓ పేదోడు ప్రధానమంత్రి కావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నది.. అవును నేను పేదవాడినే. నేను చాయ్ అమ్ముకున్నా. కానీ దేశాన్ని కాదు అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ తన మాతృభూమి అని, ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి తన జీవితం మొత్తాన్ని అర్పిస్తానని మోదీ అన్నారు.