గుజరాత్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా జిగ్నేశ్..

SMTV Desk 2017-11-27 15:40:14  jighnesh mevani, indipendent, congress support, gujarath, elections

గాంధీనగర్, నవంబర్ 27: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీ అభ్యర్ధుల కూర్పు తుది దశకు చేరింది. గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాల మద్దతు కూడగడుతుంది. మొన్న పటేళ్ళు, తాజాగా దళితులకు గాలం వేసింది. ఈ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్న‌ దళిత నేత జిగ్నేశ్ మేవానికి కాంగ్రెస్ వెలుప‌లి నుంచి మద్దతు ప్రకటించింది. బనస్కంత జిల్లాలోని వదగమ్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు మేవాని తెలిపారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మనిభాయ్‌ వాఘేలాను ఈసారి పోటీ చేయొద్దని కాంగ్రెస్‌ చెప్పిందని, ఇందుకు వాఘేలా కూడా అంగీకరించినట్లు తెలిపారు. ఇటీవ‌ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని జిగ్నేశ్ మేవాని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. అప్పుడే కాంగ్రెస్ త‌మ డిమాండ్ల‌ను అంగీక‌రించింద‌ని, తాను ఏ పార్టీలోను చేర‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. అయితే.. ఓబీసీ నేత అల్పేశ్‌ కాంగ్రెస్‌లో చేర‌గా, పాటిదార్ నేత‌ హార్దిక్‌ పటేల్ కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిస్తాన‌న్న విష‌యం విదిత‌మే. తుదకు విజయం ఏ పార్టీని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..