పీజీ ఆయుష్ కోర్సుకై ప్రత్యేక ప్రవేశ పరీక్ష

SMTV Desk 2017-06-13 19:08:20  PG Aayash Course, Kalolozhi Narayana Rao Health University Varsity Governance, Ayush, nursing, New Treatment, Public Health

హైదరాబాద్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పీజీ ఆయుష్ కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. వర్సిటీ పాలకమండలి సమావేశం సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీజీ నీట్ లో లేనటువంటి పీజీ ఆయుష్,నర్సింగ్, న్యూ ట్రీషన్, పబ్లిక్ హెల్త్ వంటి కోర్సులకు 2017-18లో అడ్మిషన్ లకు ప్రత్యేకంగా వర్సిటీ ఆధ్వర్యంలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దాదాపు 500 వరకు సీట్లున్న ఈ కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష కోసం పాలకమండలి అనుమతులను ఇచ్చింది. వర్సిటీ లో పరీక్షలన్నింటినీ డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. దీని వల్ల నిష్పాక్షికంగా వ్యవహరించడానికి వీలుకలగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలకు చెందిన దాదాపు 250 మంది ప్రిన్సిపల్ అకాడమిక్ సెనెట్ సభ్యులుగా ఉన్నారు. అన్ని కాలేజీలకు ప్రాతినిధ్యం అన్న పద్ధతిని సవరించి కేవలం 20 మంది మాత్రమే ప్రిన్సిపల్స్ సభ్యులుగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు బోర్డు ఆఫ్ స్టడీస్ ను నెలకొల్పారు. అందులో వైస్ చాన్స్ లర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి. ఆయుష్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, వైద్య విద్య మాజీ సంచాలకులు డాక్టర్ పుట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.