కేసీఆర్ తుగ్లక్‌ చర్యల వల్ల మెట్రో ఆలస్యం : ఉత్తమ్

SMTV Desk 2017-11-27 12:13:52  metro, uttam, delay, congress, kcr

హైదరాబాద్, నవంబర్ 27: రేపు మెట్రో రైలు ప్రారంభోత్సవం నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పై విమర్శల దాడి పెంచింది. తెలంగాణ ప్రభుత్వం జాప్యం కారణంగా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనిపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మెట్రో రైలు ప్రజల ప్రాజెక్ట్‌ అని తెలిపారు. మెట్రో రైలుకు సంబంధించి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని ఉత్తమ్ విమర్శించారు. ప్రాజెక్టు ప్రారంభానికి ప్రధాన ప్రతిపక్షాన్ని పిలవకపోవటం దారుణమని ఆయన అన్నారు. మెట్రో రైల్‌ కాంగ్రెస్‌ పార్టీ గొప్పతనమని, 2014 డిసెంబర్‌ నాటికే ఇది ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉన్నా కేసీఆర్‌, టిఆర్ఎస్‌ తుగ్లక్‌ చర్యల కారణంగా ఆలస్యమైందని ఆరోపించారు. ప్రకటించిన మెట్రో చార్జీలు సామాన్యులకు అందుబాటులో లేవని, దేశంలో ఎక్కడా లేని విధంగా చార్జీలు ఉన్నాయని ఉత్తమ్ విమర్శించారు.