వేతనం రూ. 6 వేలకు పెంచాలి

SMTV Desk 2017-06-13 19:05:12  Vijayawada,Asha workers union,TDP Goverment,Andhrapradesh,

విజయవాడ, జూన్ 13: ఆశ కార్యకర్తల జీతం రూ. 6000 లకు పెంచాలని ఆశ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కె.ధనలక్ష్మి అన్నారు. ఆశ వర్కర్లు వేర్వేరు జిల్లాల నుంచి తమ తమ డిమాండ్లను పరిష్కరించాలని సోమవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అనంతరం విజయవాడలోని అలంకార్ ధర్నా చౌక్ వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధనలక్ష్మీ మాట్లాడుతూ ఆశ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం 6 వేల రూపాయలు, కేరళ ప్రభుత్వం రూ .7,500 లను వేతనంగా ఇస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడిపి ప్రభుత్వం ఆశ కార్మికుల వేతనాల పెంపును విస్మరించిందని ధనలక్ష్మి ఆరోపించారు. వేతనాలు పెంచాలని, లేని పక్షంలో నిరసనలను తీవ్రతరం చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా చౌక్ వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆశ వర్కర్లను పోలీసులు అడ్డగించి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సి.సి. శ్రీనివాస్, కే.డిగురావు, ఎం.శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి ఎ. కమల మరియు నాగనేనిలను అరెస్టు చేశారు.