చేజారిన హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌: సింధు ఆశలు గల్లంతు

SMTV Desk 2017-11-26 16:27:48  pv sindhu, honkong super series, defeat

హాంకాంగ్‌, నవంబర్ 26: వరుస విజయాలతో హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగుతేజం పీవీ సింధుకు చుక్కెదురైంది. పీవీ సింధు హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నెం1 ర్యాంకర్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో 18-21,18-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం పొందారు. తొలుత 5-5తో సమంగా నిలిచిన సింధు 9-11తో స్వల్పంగా వెనకబడింది. ఆ తరువాత సింధూ తై జు యింగ్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో తై జు యింగ్‌ను చివరిసారి ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో తాజాగా జరిగిన మ్యాచ్‌తో కలిపి నాలుగు సార్లు ఓటమి పాలయ్యారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సింధు 21–17, 21–17తో ప్రపంచ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. దీంతో సైనా, ప్రకాశ్‌ పదుకొణె తర్వాత హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌ను అందుకోవాలన్న ఆశకు అడుగు దూరంలో నిలిచింది.