కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన చంద్రబాబు...

SMTV Desk 2017-11-26 14:42:55  tdp, chandrababu, command control room, secratariat

అమరావతి, నవంబర్ 26: టెక్నాలజీని అనుసంధానిస్తూ పాలించడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారి అక్కడి నుంచే ముఖ్యమంత్రితో నేరుగా సంభాషించే అత్యాధునిక వ్యవస్థ అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో అందుబాటులోకి వచ్చింది. ఆర్‌టీజీఎస్‌ ఏర్పాటు చేసిన ఈ కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో ఆసియాలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్‌ మందిరం(బార్కో)ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటుచేసిన దీని ద్వారా అధికారులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే ఇబ్బంది నుంచి ఉపశమనం కలగనుంది. అధికారి సెల్‌ఫోన్‌ ద్వారా ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడి నుంచే నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి సర్వే లెన్స్‌ కెమెరాల ద్వారా రాష్ట్రం మొత్తాన్ని ముఖ్యమంత్రి నేరుగా వీక్షించవచ్చు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5వేల కెమెరాలు ఏర్పాటుచేశారు. త్వరలో మరో 15వేల కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఇక్కడి నుంచే ఆదేశాలు జారీచేయొచ్చు. అవసరమైతే ఆయా ప్రాంతంలో డ్రోన్ల సాయంతో తాజా పరిస్థితిని తిలకిస్తూ ఆదేశాలిచ్చే వ్యవస్థ ఏర్పాటుచేశారు.