అంకుర నగరంగా హైదరాబాద్‌: టి-హబ్‌ సీఓఓ శ్రీనివాస్‌

SMTV Desk 2017-11-26 12:49:28  t hub, hyderabad, startup, srinivas kollipara

హైదరాబాద్, నవంబర్ 26: హైదరాబాద్‌ను అంతర్జాతీయ అంకుర కంపెనీల నగరంగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం అని టి-హబ్‌ సీఓఓ శ్రీనివాస్‌ కొల్లిపర పేర్కొన్నారు. టి-హబ్‌ను ఏర్పాటు చేసిన తర్వాత అంకుర కంపెనీల వ్యవస్థ ఇక్కడ బాగా బలోపేతమైంది. దేశవ్యాప్తంగా మనకు ఒక గుర్తింపు లభించింది. అంతర్జాతీయంగా గుర్తింపు లభించడానికి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు దోహదం చేస్తుంది. అమెరికా, భారత్‌లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంకుర కంపెనీల ప్రతినిధులు దాదాపు 1,200 మంది హైదరాబాద్‌ విచ్చేస్తున్నారు. ఇందులో అమెరికా, భారత్‌ల నుంచి 400 మంది చొప్పున ఉన్నారు. అంకుర కంపెనీల ఇది అతిపెద్ద నెట్‌వర్కింగ్‌ సదస్సు. అంకుర కంపెనీలతో వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చే యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వాటిలో పెట్టుబడి పెట్టే మదుపర్లు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు మొదలైన వారినందరిని ఒక వేదిక పైకి తీసుకువచ్చేందుకు అమెరికా ప్రభుత్వం జీఈఎస్‌ను నిర్వహిస్తోంది. దీర్ఘకాలంలో అంకురాలు, కంపెనీల మధ్య భాగస్వామ్యాలకు అవకాశం ఉంది. ప్రపంచ దృష్టి అంతా హైదరాబాద్‌పై పడుతుంది. జీఈఎస్‌కు విచ్చేస్తున్న ఆయా దేశాల ప్రముఖుల్లో దాదాపు 40 మంది టి-హబ్‌ను సందర్శించనున్నారు. టి-హబ్‌ను ప్రారంభించిన తర్వాత హైదరాబాద్‌లో అంకుర కంపెనీల సంఖ్య పదింతలైంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం నిధులతో నడుస్తున్న అత్యధిక ఇంక్యుబేటర్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. లాభాపేక్ష రహిత కంపెనీగా టి-హబ్‌ను ఏర్పాటు చేశాం. గతంలో ఈ విధంగా దేశంలో ఎవరూ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయలేదు. అనేక రాష్ట్రాలు ఈ మోడల్‌ను అనుసరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. తమ, తమ రాష్ట్రాల్లో అంకుర కంపెనీల వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడానికి టి-హబ్‌, తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శనం కోసం అసోం, గోవా, దిల్లీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కార్పొరేట్‌ ఇన్నోవేషన్‌పై దృష్టి పెట్టాం. ఇంటెల్‌, శాంసంగ్‌, యస్‌ బ్యాంక్‌, క్వాల్‌కామ్‌, యునైటెడ్‌ టెక్నాలజీస్‌ వంటి కంపెనీల కోసం కార్పొరేట్‌ ఇన్నోవేషన్‌ కార్యక్రమాలను చేపడుతున్నాం. కొన్ని అంకుర కంపెనీలు అభివృద్ధి చేసే ఉత్పత్తుల వల్ల కొత్త పరిశ్రమలే పుట్టుకు వస్తాయి. ఉబర్‌నే తీసుకుంటే వేల మంది డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తూ ఒక కొత్త పరిశ్రమకు అవకాశం కల్పించింది. అంకురాల వల్ల ఆదాయాలు, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఇప్పటి వరకూ ఎవరూ పట్టించుకోని అనేక సమస్యలకు అంకురాలు పరిష్కారం చూపుతున్నాయి.