మహిళపై ఖాకీ కన్ను

SMTV Desk 2017-06-13 17:12:19   She Teams, Womens Security in hyderabad, Police, Twitter

హైదరాబాద్‌, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్‌తో హైదరాబాద్‌ మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని చెబుతున్న పోలీసులు, తమ సిబ్బంది బారినుంచి మాత్రం మహిళలను రక్షించలేకపోతున్నారు. దొంగతనం జరిగిందంటే సంఘటన స్థలం చూసేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌.. అక్కడ వివరాలు సేకరించాల్సింది పోయి భాదితురలైన మహిళ ఛాతీని అదేపనిగా చూశారు. బాధిత మహిళ పోలీసులకు దీనిపై ట్వీట్‌ చేసినా, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాతికేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్న రిటైర్డ్‌ ఇంజనీర్‌.. జీడిమెట్ల అపురూప టౌన్‌షిప్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె అమీర్‌పేటలో నివసిస్తుంది. అనారోగ్యం కారణంగా ఆయనను చూసుకోడానికి అసోంకు చెందిన ఒక వ్యక్తిని నియమించారు. మూడునెలలు మంచిగా పనిచేసిన ఆ వ్యక్తి.. మే 30న ఆయన నిద్రపోతుండగా రూ. 45 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ తీసుకుని పరారయ్యాడు. అతడు లేకపోవడంతో రిటైర్డ్‌ ఇంజనీర్‌ మరింత అస్వస్థతకు గురయ్యారు. చుట్టుపక్కలవారు ఈ విషయాన్ని కూతురికి చేరవేశారు. దాంతో ఆమె వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లింది. జూన్‌ 5న స్పృహలోకి వచ్చిన ఆయన జరిగిన దొంగతనం గురించి కూతురికి తెలపడంతో, మరునాడు 6వ తేదీన దొంగతనంపై ఫిర్యాదు చేయడానికి జీడిమెట్ల ఠాణాకు ఆమె వెళ్ళింది. ఘటన స్థలాన్ని చూడాలని పోలీసులు చెప్పడంతో.. వారిని అపురూప టౌన్‌షిప్‌కు ఆమె తీసుకువచ్చింది. అక్కడ ఆమె వివరాలు చెబుతుంటే ఓ కానిస్టేబుల్‌ నమోదు చేసుకుంటున్నారు. ఇక మరో కానిస్టేబుల్‌ మాత్రం బాధితురాలి ఛాతీని చూడటం ప్రారంభించారు. 15 నిమిషాల పాటు ఏకధాటిగా అదేపని చేయటంతో దానిపై ఆమె 6వ తేదీన తెలంగాణ పోలీస్‌ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌చేసినా స్పందన లేదు. నాలుగు రోజుల తర్వాత అంటే 10వ తేదీన బాధితురాలి మిత్రుడు ఒకరు అదే అంశాన్ని డీజీపీ ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. డీజీపీ ఆ ట్వీట్‌ను వెంటనే సైబరాబాద్‌ పోలీసులకు ఫార్వర్డ్‌ చేశారు. ఇప్పటివరకు ఈ అంశంపై పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. బాధితురాలి పట్ల స్టేషన్‌ హౌస్‌ అధికారి ప్రవర్తన కూడా బాగోలేదని తెలిసింది. సాయంత్రం 4.30కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే రాత్రి 8.30 వరకు తనను స్టేషన్‌లో ఉంచారని బాధితురాలు వెల్లడించింది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన సిబ్బందే రక్షణ రహితంగా ప్రవర్తిస్తుంటే ఇక రోజు రోజుకి భాదితుల సంఖ్య పెరుగుతూ పోతుంది.