పౌష్ఠికాహారంపై అవగాహన మెరుగవ్వాలి: మోదీ

SMTV Desk 2017-11-26 11:52:12  modi, health, food, neeti ayog, 2022, goal

న్యూ డిల్లీ, నవంబర్ 26: ప్రజారోగ్యం పై పట్టుదలగా ఉన్న ప్రధాని మోదీ... అనుకున్న ఫలితాలను సాధించాలంటే పౌష్ఠికాహారం ప్రాముఖ్యాన్ని గురించి సామాజిక అవగాహనను మరింత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికోసం సంప్రదాయ ప్రచార మార్గాలను వినియోగించుకోవాలని చెప్పారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పౌష్ఠికాహారంతో ముడిపడిన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పథకాలన్నింటినీ ఏకీకృతం చేయాలని పిలుపునిచ్చారు. పోషకాహార లోపాన్ని అధిగమించడంలో 2022 నాటికి ఫలితాలు ప్రస్ఫుటంగా కనిపించాలని చెప్పారు. దేశంలో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఉద్దేశించిన పథకాల్లో పురోగతిని ప్రధాని శుక్రవారం ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ప్రధానమంత్రి కార్యాలయం, నీతి ఆయోగ్‌, ఇతర మంత్రిత్వ శాఖల అధికారులు దీనిలో పాల్గొన్నారు. ప్రస్తుత అపౌష్ఠికత స్థాయి, వివిధ అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు గురించి చర్చించారు. తక్కువ బరువుతో శిశువులు పుట్టడం, రక్తహీనత వంటివీ చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సూచిలో భారత్ ర్యాంకు మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలని మోదీ అధికారులకు సూచించారు.