ఇస్లామాబాద్‌-రావల్పిండి రహదారి రణ రంగ౦

SMTV Desk 2017-11-26 11:35:33  Islamabad-Rawalpindi road, Islamabad, pakistan,

పాకిస్థాన్, నవంబర్ 26: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఆందోళనకరమైన సంఘటన చోటు చేసుకుంది. న్యాయశాఖ మంత్రి జహీద్‌ అమీద్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ తో 20 రోజులుగా ఇస్లామాబాద్‌-రావల్పిండి రహదారిని ఆందోళన కారులను దిగ్బంధించారు. వారిని పోలీసులు చెదర కొట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసన కారుల రాళ్ల దాడులు, భద్రత సిబ్బంది ప్రతి దాడులతో ఆ ప్రాంతమంతా రణ రంగాన్ని తలపించాయి. ఓ బిల్లు రూపకల్పనలో న్యాయశాఖ మంత్రి తీరును తప్పు పడుతూ తెహ్రిక్‌ ఏ లాబాయిక్‌ యా రసూల్‌ అల్లా పార్టీకి చెందిన రెండువేల మంది కార్యకర్తలు ఈనెల 6 నుంచి ఇస్లామాబాద్‌-రావల్పిండి రహదారిని దిగ్బంధించారు. ఫలితంగా ఆ మార్గంలో రాకపోకలపై తీవ్ర ప్రభావం పడగా, సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక ఓ బాలుడు మృతిచెందాడు. ఈ వ్యవహారంపై ఇస్లామాబాద్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇవాళ పోలీసులు, పారా మిలటరీ దళాల్ని రంగంలోకి దింపింది. పదుల సంఖ్యలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది మిగిలిన వారిని చెదరగొట్టారు.