టీఆర్టీ నోటిఫికేషన్ యధాతధం: కడియం

SMTV Desk 2017-11-25 16:54:16  trt, notofication, kadiyam srihari, high court

హైదరాబాద్, నవంబర్ 25: టీఆర్టీ(టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు) నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేయకుండా, గడువు మాత్రమే పొడిగించాలని చెప్పిందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ బ్రాంచీ నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ. 420 కోట్లు విడుదల చేసిందని, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రూ. 20 కోట్లు కేటాయించామని చెప్పారు. ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో టీచర్ పోస్టుల ఖాళీలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు న్యాయం చేసేందుకు 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చామని కడియం పేర్కొన్నారు. నిన్నటి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలపై 2, 3 రోజుల్లో చర్చించి.. తదుపరి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ తేదీని పొడిగించాలని కోర్టు ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. త్వరలోనే టీఆర్టీ నిర్వహించి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల కలలను సాకారం చేస్తామని మంత్రి ఉద్ఘాటించారు.