గుజరాత్ ఎన్నిక ప్రచారంలో 150 మంది ఎన్నారై పటేళ్ల రాక

SMTV Desk 2017-11-25 16:38:24  Gujarat elections, NRI Patels, BJP, Congress

అహ్మదాబాద్, నవంబర్ 25 ‌: గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, ఇరు పార్టీల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తన మద్దతు కాంగ్రెస్‌కేనని పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి నేత హార్దిక్‌ పటేల్‌ ప్రకటించగా, పటేల్‌ వర్గం ఎన్నారైలు మాత్రం హార్దిక్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. తాము భాజపాతోనే ఉంటామని ఎన్నారై పటేల్‌లు ముక్తకంఠంగా చెప్పడంతో పాటు, భాజపాకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తామన్నారు. గుజరాత్‌లో బాగా ప్రాబల్యం ఉన్న వర్గం పాటిదార్‌(పటేల్‌) కమ్యూనిటీ. దశబ్దాలుగా మెజార్టీ పటేల్‌ వర్గం భాజపాతోనే ఉంది. అయితే ఇటీవల పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కాంగ్రెస్‌కు మద్దతిస్తుందని హార్దిక్‌ పటేల్‌ ప్రకటించారు. దీంతో ఈ నిర్ణయంపై విదేశాల్లో ఉంటున్న గుజరాత్‌ పటేల్‌ వర్గీయులు స్పందించారు. తాము భాజపాతో మాత్రమే ఉంటామని స్పష్టంగా చెప్పారు. భాజపా తరఫున ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు త్వరలోనే 150 మంది ఎన్నారై పటేళ్లు గుజరాత్‌కు రానున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం సాధించిన అభివృద్ధిని గురించి గుజరాత్‌కు వచ్చి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. భాజపాకు మద్దతిస్తున్న పటేల్‌ ఎన్నారై నెట్‌వర్క్‌ బృంద సభ్యులు ఈ విషయంపై ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా చర్చలు జరుపుతున్నారు.