జెఫ్‌ బిజోస్‌ సంపద 100 బిలియన్‌ డాలర్లు

SMTV Desk 2017-11-25 16:11:42  amazon founder, jeff bezos,100 billion, bill gates

న్యూఢిల్లీ, నవంబర్ 25 : అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బిజోస్‌ మరో సారి వార్తల్లో నిలిచాడు. గత అక్టోబర్‌లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన బిజోస్‌, తాజాగా మరో ఘనత సాధించారు. శుక్రవారం బ్లాక్‌ ఫ్రైడే సేల్స్‌లో అమెజాన్‌లో అమ్మకాలు హోరెత్తాయి. కంపెనీ షేర్ల విలువ కూడా బాగా పెరిగింది. దీంతో బిజోస్‌ సంపద ఏకంగా 100.3 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. కాగా.. 1999 తర్వాత ఈ అరుదైన మైలురాయిని సాధించిన తొలి బిలియనీర్‌ బిజోస్‌ కావడం విశేషం.1999లో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ఈ ఘనత సాధించారు. అయితే ఆ తర్వాత తన సంపదలో కొంత ఛారిటీలకు, గేట్స్‌ ఫౌండేషన్‌కు ఇచ్చేశారు. లేదంటే ప్రస్తుతం బిల్‌గేట్స్‌ సంపద 150 బిలియన్‌ డాలర్ల వరకూ ఉండేది. ప్రస్తుత విపణిలో ఈ- కామర్స్ సంస్థ అమెజాన్‌ దూసుకుపోతుంది.