ఆస్కార్‌ పిస్టోరియస్‌ శిక్ష పెంపు

SMTV Desk 2017-11-24 17:57:47  OSCAR PISTORIUS, SOUTH AFRICA, PARA OLYMPION, REEVA

జోహెన్స్‌బర్గ్‌, నవంబర్ 24: సౌత్ఆఫ్రికా మాజీ పారాలింపియన్‌ ఆస్కార్‌ పిస్టోరియస్‌ జైలు శిక్షను, పొడిగిస్తూ దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు ఆఫ్‌ ఆప్పీల్స్‌ శుక్రవారం తీర్పు వెలువరిచింది. 2013లో ప్రేమికుల దినోత్సవం రోజున ఆస్కార్‌ తన ప్రేయసి రీవా స్టీన్‌క్యాంప్‌ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. . ఈ కేసులో ఇప్పటికే అతడికి ఆరేళ్ల జైలు శిక్ష విధించగా.. ఇప్పుడు దానిని 13ఏళ్ల ఐదు నెలలకు పెంచుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రీవాను దొంగ అనుకుని పొరపాటుగా కాల్చి చంపినట్లు విచారణ సమయంలో అతడు అధికారులకు తెలిపాడు. ఈ కేసులో అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ 2014లో స్థానిక హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే 10 నెలల జైలు శిక్ష తర్వాత అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. మరోవైపు రీవాది కుట్రపూరిత హత్యే అని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం 2016లో ఆస్కార్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నిర్ణయం పై సంతృప్తి చెందని అక్కడి ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. శుక్రవారం మరోసారి విచారించిన కోర్టు, ఈ కేసులో అతడికి 15ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇందులో ఇప్పటికే 19నెలల శిక్ష పూర్తవడంతో మరో 13 ఏళ్ల ఐదు నెలలు ఆస్కార్‌ జైల్లోనే ఉండాలని తీర్పు వెలువరించింది.