ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం...

SMTV Desk 2017-11-24 13:25:31  train accident, utharapradesh, dead, piyush goyal

లక్నో, నవంబర్ 24: ఉత్తరప్రదేశ్‌లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. చిత్రాకూట్‌ జిల్లాలోని మానిక్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ ప్రయాణికుల రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. చిత్రాకూట్‌ నుంచి పట్నా వెళ్తున్న వాస్కోడిగామా-పట్నా ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం తెల్లవారుజామున 4.18 గంటలకు ప్రమాదానికి గురైంది. రైలు మాణిక్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే 13 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన తండ్రీకొడులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడగా, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌ దెబ్బతినడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు, క్షతగాత్రులకు రూ. లక్ష చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.