సర్వదర్శనం స్లాట్‌కు ముహూర్తం ఖరారు

SMTV Desk 2017-11-23 17:46:43  TTD Slot, thirumala Adhar

తిరుమల, నవంబరు 23 : డిసెంబర్ 8వ తేదీ నుంచి వారం రోజుల పాటు సర్వదర్శనం స్లాట్‌కు ప్రయోగాత్మకంగా ముహూర్తం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఆ ఏడు రోజుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ప్రయోజనాలను పరిశీలించి, ఆ తర్వాత నిర్దిష్ట విధివిధానాలతో స్లాట్‌ను రూపొందించడానికి రంగం సిద్ధం చేయాలని భావిస్తోంది. సర్వదర్శనంలో స్లాట్‌ కేటాయించడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం, తిరుమలలో కౌంటర్ల నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లన్నీ పూర్తిచేసి 7వ తేదీకి సంసిద్ధంగా ఉండాలని టీటీడీ ఉన్నతాధికారులు ఆయా విభాగాలను ఆదేశించారు. అదే రోజున పైలట్‌ ప్రాజెక్టుగా తిరుమలలో వివిధ ప్రాంతాలలోని 150 కౌంటర్లలో సర్వదర్శనం స్లాట్‌ టోకెన్ల జారీ ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. కౌంటర్ల వద్దకు వచ్చిన భక్తుల నుంచి ఆధార్‌ తీసుకుని ఫొటోతో, దర్శనం వేళను పేర్కొంటూ టోకెన్‌ను జారీ చేస్తారు. భక్తులు తమ టోకెన్‌పై ఉన్న సమయానికి వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్‌ ముందు కొత్తగా నిర్మించిన కాంప్లెక్స్‌కు చేరుకోవాలి. అక్కడ లడ్డూ టోకెన్లను పొందిన వెంటనే నిరీక్షణ లేకుండా దర్శనానికి అనుమతిస్తారు. ఆధార్‌ లేని భక్తులను యథావిధిగా వైకుంఠం-2 క్యూ కాంప్లెక్స్‌ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. ఒకసారి టోకెన్‌ స్వీకరించిన భక్తులు 48 గంటల వరకు మళ్లీ టోకెన్‌ పొందడానికి అవకాశం లేకుండా నిబంధన విధించనున్నారు.