శశికళ వ్యతిరేక వర్గానికే రెండాకుల గుర్తు...

SMTV Desk 2017-11-23 14:31:18  ec, aiadmk, two leaves, shashikala

చెన్నై, నవంబర్ 23: తమిళనాడులో శశికళ వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి యడప్పాడి పళనిస్వామి వర్గానికే అన్నాడీఏంకే రెండు ఆకుల గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో వర్గపోరు తలెత్తింది. శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలుగా విడిపోయి.. అధికారం కోసం తీవ్ర యత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో శశికళ వర్గానికి చెందిన యడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాతి పరిణామాల నేపథ్యంలో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఒక్కటై శశికళను, ఆమె మేనల్లుడు దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇరు వర్గాలు పార్టీ గుర్తు తమకే కేటాయించాలని ఈసీని ఆశ్రయించారు. మరోవైపు రెండాకుల గుర్తును తమకే కేటాయించేలా ఎన్నికల సంఘంలోని ఓ అధికారికి లంచం ఇచ్చేందుకు యత్నించి దినకరన్‌ దొరికిపోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. గత కొంత కాలంగా ఈ గుర్తును ఎవరికి కేటాయించాలనే అంశంపై తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఇవాళ తుది నిర్ణయం వెలువరించింది. దీంతో అన్నాడీఎంకే అధికార వర్గ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.