సుబ్బలక్ష్మిని కాపాడిన పోలీసులు

SMTV Desk 2017-06-13 12:38:02  warangal police, commissioner, sudheer babu, subbalakshmi, riyad, woman, dubai,

వరంగల్‌, జూన్ 13: ఆర్థిక పరిస్థితి బాగోలేక పొట్టకూటికోసం విదేశమైన రియాద్ కు వెళ్ళింది సుబ్బలక్ష్మి. అమాయకురాలైన సుబ్బలక్ష్మిని ఏజెంట్లు మోసం చేసి రియాద్ షేక్ కు అమ్మేసారు. ఆ షేక్ రాక్షసంగా ఆమెను మరుగుదొడ్డిలో బంధించి తీవ్ర చిత్రహింసలు చేస్తుండడంతో, స్థానిక మహిళ సాయంతో సుబ్బలక్ష్మి తన పరిస్థితిని తన బంధువులకు వీడియో ద్వారా చేరవేసింది. ఆ వీడియో చూసిన పోలీసులు రంగంలోకి దిగి షేక్ బంధినుంచి సుబ్బలక్ష్మిని కాపాడారు. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా సిద్దవటం గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దుబాయిలో కూలిపని చేయడానికని ఏజెంట్లు జిలాని, వలి వెంకటేష్ లను ఆశ్రయిచింది. సుబ్బలక్ష్మి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న జిలాని, వలి వెంకటేష్ లు ఆమె వద్దనుండి రూ. 80 వేలు తీసుకున్నారు. వారు ఆమెను దుబాయ్ కాకుండా రియాద్‌ దేశంలోని అబ్దుల్లా షేక్‌కు రూ. 2 లక్షలకు విక్రయించారు. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని వైౖద్యులు చెప్పడంతో షేక్‌ ఆమెను ఇరుకైన మరుగుదొడ్డిలో బంధించి వేధించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో సుబ్బలక్ష్మి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆమె పడుతున్న బాధలను అక్కడ ఉన్న ఓ స్థానిక మహిళ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, కువైట్‌లో ఉన్నబంధువులకు పంపింది. ఆ వీడియోను వారు సుబ్బలక్ష్మిసోదరుడికి పంపించారు. ఈక్రమంలో ఆ వీడియో అనుకోకుండా వాట్సాప్ ద్వారా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్ కు చేరింది. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి ఆ వీడియోపై ఆరా తీశారు. పూర్తి విషయాలు తెలుసుకున్నపోలీసులు రూ. 2 లక్షలను అబ్దుల్లాషేక్‌కు చెల్లించి సుబ్బలక్ష్మిని వరంగల్‌ తీసుకొచ్చి అనంతరం స్వస్థలానికి పంపించారు. బాధిత మహిళ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ.. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ పునర్జన్మనిచ్చారని, నా జన్మాంతం వారికి రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపింది.