ఇవాంక భద్రతకు జనరల్‌ మోటార్స్‌ ప్రత్యేక కారు...

SMTV Desk 2017-11-23 10:59:10  ivanka, car, general motors, america

హైదరాబాద్, నవంబర్ 23: అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో పాల్గొనటానికి హైదరాబాద్‌ రానున్న ఇవాంకకు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు, ఆయన ముద్దుల కుమార్తె ఇవాంక ట్రంప్ కు ప్రపంచంలోని అన్ని ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉంది. ప్రధానంగా సిరియాలోని ఐసిస్‌ ఉగ్రవాదులు, సానుభూతిపరులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా ఆమె భద్రత అంతా అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఇవాంక పర్యటన కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా మూడు వాహనాలను తెప్పిస్తున్నారు. జనరల్‌ మోటార్స్‌ సంస్థ అమెరికా అధ్యక్షుడి కుటుంబం కోసం ప్రత్యేకంగా తయారు చేసే లీమోజీన్‌ వాహనాలు త్వరలో హైదరాబాద్‌ రానున్నాయి. మందుపాతరలు, తుపాకీ తూటాల నుంచి మాత్రమే కాదు రాకెట్‌ లాంచర్లు, జీవ, రసాయన దాడుల నుంచీ రక్షించగలిగేలా అన్ని రకాల సదుపాయాలు ఈ వాహనంలో ఉంటాయి. అధునాతన సమాచార వ్యవస్థతో చిన్నపాటి కార్యాలయంలా ఉంటుంది. ఇటువంటి వాహనాలు మూడింటిని తెప్పిస్తున్న అమెరికా అధికారులు ఇవాంక హైదరాబాద్‌లో పాల్గొనే అన్ని కార్యక్రమాలకూ వీటినే వాడబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందులో తప్ప మిగతా కార్యక్రమాల్లో ఇవాంక ప్రత్యేక వంటవాళ్లు తయారు చేసే ఆహారమే తీసుకుంటారు. ఆమె మెనూ ఇప్పటికే హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి చేరింది. వంటదినుసులు కూడా అమెరికా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ఇవాంక పర్యటనను అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలోని సీక్రెట్‌ సర్వీస్‌ కార్యాలయం నుంచే పర్యవేక్షించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రత్యేక డ్రోన్లు, నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి ఆమె పర్యటించే, పరిసర ప్రాంతాల అన్నింటిపైనా నిరంతరం నిఘా కొనసాగించనున్నారు. అనూహ్య పరిణామాలు ఎదురైతే అమెరికా భద్రతా సిబ్బందికి శ్వేతసౌధం నుంచే ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇవాంక బస చేసే వెస్టిన్‌ హోటల్‌ సిబ్బంది వివరాలన్నీ అధికారులు సేకరించారు. ఆమె ఉన్నప్పుడు విధుల్లో పాల్గొనే వారందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి వారిని మాత్రమే అనుమతి౦చాలని నిర్ణయించారు.