కన్న తండ్రే క్రూరంగా చంపించేశాడు..

SMTV Desk 2017-11-22 20:49:36  father killed childrens, crime, Kurukshetra,

న్యూఢిల్లీ, నవంబర్ 22: చిన్నారులని చూడకుండా కర్కశ భావంతో చంపిచాడు కన్న తండ్రి. కన్న తండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. ఈ దారుణమైన ఘటన హరియాణాలోని కురుక్షేత్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కురుక్షేత్రకు చెందిన సోను మాలిక్‌ స్థానికంగా ఫొటో స్టూడియో నడుపుతుంటాడు. ఆయన ముగ్గురు పిల్లలు సమీర్‌(11), స్రిమన్‌(8), సమర్‌(5) గత ఆదివారం నుంచి అదృశ్యమయ్యారు. ఆడుకోడానికి వెళ్లిన పిల్లలు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన సోను భార్య కుటుంబసభ్యులతో కలిసి ఊరంతా వెతికింది. అయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు ఖంగు తినే నిజం దొరికింది. తండ్రి సోను మాలిక్‌, బంధువు చేత చంపించాడని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆదివారం ఉదయం ఆడుకోడానికి బయటకు వెళ్లిన చిన్నారులను వారి మామయ్య జగ్దీప్‌ కలిశాడు. ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్తానని చెప్పి వారిని కార్లో ఎక్కించుకున్నాడు. అలా పిల్లలను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హతమార్చాడు. ముందు సమీర్‌ను కారు నుంచి దింపి కొంత దూరం అడవిలోకి తీసుకెళ్లి తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత సిమ్రన్‌ను దింపి మరో చోటుకు తీసుకెళ్లి చంపాడు. ఆ తర్వాత సమర్‌ను కూడా హత్య చేశాడు. పిల్లల కోసం గాలిస్తున్న సమయంలో సోను, జగ్దీప్‌ ప్రవర్తన వింతగా ఉండటాన్ని పోలీసులు అనుమానించారు. దీంతో జగ్దీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు హత్యల విషయం చెప్పాడు. తండ్రి సోనునే తనకు పిల్లలను చంపమని చెప్పాడని జగ్దీప్‌ విచారణలో చెప్పాడు. వెంటనే పోలీసులు సోను, జగ్దీప్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.