ఐపీఎల్ లో "జంప్" ఆప్షన్..?

SMTV Desk 2017-11-22 18:20:38  ipl, league 11, bcci, t-20 league, mumbai

ముంబై, నవంబర్ 22 :ప్రపంచ క్రికెట్ చరిత్రలో టీ-20 మ్యాచ్ లు కున్న ఆదరణే వేరు...అందులో ఐపీఎల్ అయితే చెప్పనక్కర్లేదు...బీసీసీఐ బంగారు బాతు గుడ్డుగా చెప్పుకొనే ఈ టోర్నీలో సరికొత్త మార్పు చోటు చేసుకున్నట్లు ఓ జాతీయ పత్రిక తెలిపింది. ఐపీఎల్‌-11వ సీజన్‌ కోసం మంగళవారం ముంబయిలో బీసీసీఐ అధికారులతో ఫ్రాంఛైజీ యజమానుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విధానం, జీతాలపై పరిమితి తదితర అంశాలపై చర్చలు జరిగాయి. మరో అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. టోర్నీలో ఒక్కో జట్టు లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లు ఆడుతోంది. కానీ చాల మంది ఆటగాళ్లు రిజర్వు బెంచ్ కే పరిమితమవుతారు. ఇక నుండి అవకాశం రాని ఆటగాళ్లు అదే జట్టును అట్టిపెట్టుకునే ఉండాల్సిన అవసరం లేకుండా మధ్యలోనే ఆ జట్టును వీడి మరో జట్టులోకి వెళ్లిపోవచ్చు. ఇది ఐపీఎల్ లో కొత్తదే గాని ఫుట్‌బాల్‌ లీగ్స్‌లో దీనినే ‘మిడ్‌ డే టోర్నమెంట్‌ ప్లేయర్‌ ట్రాన్స్‌ఫర్‌’అంటారు. దీనిపై బీసీసీఐ ఆధికారులు, ఫ్రాంఛైజీ యజమానులు ఎటువంటి స్పందన చేయకపోవడం విశేషం.