కెనడాలో భారతీయ విద్యార్ధుల సంఖ్య అధికం

SMTV Desk 2017-11-22 18:18:33  Canada, indians students, trump

న్యూఢిల్లీ, నవంబర్ 22 : ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పీఠంలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ కొన్ని నెలల క్రితం వీసా నిబంధనల విషయంలో అత్యంత కఠినతరంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇలా ట్రంప్ చేసిన ఈ రక్షణాత్మక ధోరణి పొరుగుదేశమైన కెనడాకు కలిసొచ్చింది. ప్రస్తుతం ఆ దేశం అంతర్జాతీయ విద్యార్థులను అమితంగా ఆకర్షిస్తోంది. వీసా నిబంధనల కారణంగా ఒక్క ఈ ఏడాదిలోనే భారత్‌ నుంచి 20-30 శాతం ఎంబీఏ విద్యార్థులు కెనడా విశ్వవిద్యాలయల్లో చేరడం జరిగింది. టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన రాట్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో 2019తో ముగిసే విద్యా సంవత్సరంలో 350 మంది ఎంబీఏ విద్యార్థుల్లో 56 మంది భారతీయులే కావడం విశేషం. తమ అంతర్జాతీయ ఎంబీఏ విద్యార్థుల్లో 60-70 శాతం భారతీయులే అని ఎడ్మాంటన్‌లోని కాల్గరి విశ్వవిద్యాలయానికి చెందిన హస్కయెన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ పేర్కొంది. ఎంబీఏ చేసిన తర్వాత మూడేళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేసుకునేలా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ద్వితీయ, తృతీయ శ్రేణి బిజినెస్‌ స్కూళ్లలో అభ్యసించే కన్నా కెనడాలో చదవడం ఉత్తమమని విద్యార్థులు భావిస్తున్నారు. దానికి తోడు కెనడా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 8 శాతం పెరగడం అనుకూలంగా మారింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇక్కడయ్యే ఖర్చు చాలా తక్కువ.