రైల్వే తరహాలోనే విమాన ప్రయాణానికి ఆధార్‌

SMTV Desk 2017-11-22 16:47:06  Aadhaar for flight travel, central government, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 22 : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బ్యాంకు ఖాతా దగ్గరి నుంచి రైల్వే టికెట్లు బుక్‌ చేసుకునే దాకా ఆధార్‌ నంబర్‌ అనుసంధాన విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో రానున్న కొత్త సంవత్సరంలోను కోల్‌కతా, అహ్మదాబాద్‌, విజయవాడ ప్రాంతాల్లోని విమానప్రయాణికులకు విమాన టికెట్లు బుక్‌ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ను తీసుకొస్తుంది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘డిజియాత్ర’లో భాగంగా వచ్చే ఏడాది నుంచి మూడు విమానాశ్రయాల్లో తొలుత ప్రయోగాత్మకంగా దీన్ని చేపట్టనున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) వెల్లడించింది. విమాన టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో ఆధార్‌ నంబర్‌ ఇవ్వడం వల్ల విమానాశ్రయానికి వచ్చే సమయంలో ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోయినా, లోపలికి అనుమతించడం జరుగుతుంది. దీని కోసం విమానాశ్రయాల్లో బయోమెట్రిక్‌ యాక్సెస్‌ను అందుబాటులోకి తేనున్నారు. ప్రయాణికుడు విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద టచ్‌ ప్యాడ్‌పై బొటనవేలు ఉంచితే, ప్రయాణికుడు ఏ విమానానికి టికెట్‌ బుక్‌ చేసుకున్నాడో తెలిపే పూర్తి సమాచారం వస్తుంది. ఐడీ కార్డులు చూపించడం, పేపర్‌ టికెట్లు, బోర్డింగ్‌ కార్డులు చూపించడం వంటి వాటిని తొలగించేందుకు ఈ పద్ధతిని తీసుకురానున్నారు. దీని ద్వారా ప్రవేశద్వారం వద్ద క్యూలో వేచి ఉండే సమయం తగ్గుతుంది.