హ్యాకింగ్‌ కు గురైన ఉబర్‌

SMTV Desk 2017-11-22 11:05:54  UBER, DATA HACKING, CAR RENT SERVICE, CEO DAARAA

శాన్‌ఫ్రాన్సిస్కో, నవంబర్ 22 : నేటి సమాజంలో సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా సైబర్ నేరగాళ్లు కూడా చెలరేగిపోతున్నారు. ప్రముఖ సంస్థలే లక్ష్యంగా హ్యాకర్లు తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఉబర్‌ చెందిన 57 మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సీఈవో డారా ఖోస్రోషాహి కూడా ధ్రువీకరించారు. సంస్థ క్లౌడ్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసి డేటాను దొంగలించినట్లు డారా తెలిపారు. హ్యాక్‌ అయిన డేటాలో రైడర్ల పేర్లు, ఈమెయిల్‌ అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లతో పాటు డ్రైవర్ల పేర్లు, వారి లైసెన్స్‌ల వివరాలు ఉన్నట్లు ఉబర్‌ పేర్కొంది. అయితే ఈ సమాచారాన్ని తొలిగించేందుకు సదరు హ్యాకర్లకు ఉబెర్ 1,00,000 డాలర్లు ఇచ్చినట్లు సమాచారం. ఇక నుండి ఇటువంటి చర్యలు జరగకుండా జాగ్రతలు తీసుకుంటామని సంస్థ వెల్లడించింది.