త్వరలోనే జనసేన ప్లీనరీ: పవన్ కళ్యాణ్

SMTV Desk 2017-11-21 15:49:13  janasena plenary, pawan kalyan, janasena updates

హైదరాబాద్, నవంబర్ 21: ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపైన తర్జనభర్జన పడుతున్నట్లుగా ఉంది. త్వరలోనే ప్లీనరీని నిర్వహించాలని, పార్టీ విధి విధానాలను ప్రజలలోకి తీసుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రజలతో మమేకం కావాలని కూడా ఆయన భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటించే విషయంపై కూడా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారని చెబుతున్నారు. ఆదివారం నాడు ఆయన పార్టీ నేతలతో సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని, సభ్యత్వ నమోదును ఉధృతం చేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత ప్లీనరీని చేపడితే ప్రజా గొంతుకను వేదిక ద్వారా వినిపించినట్లు అవుతుందని పార్టీ అభిప్రాయపడుతోంది.