అంబులెన్స్‌ ముందా? కాన్వాయ్‌ ముందా?

SMTV Desk 2017-11-21 15:37:51  Karnataka Chief Minister Siddaramaiah, Conway, Ambulance

బెంగళూరు, నవంబర్ 21 : గతంలో భారత రాష్ట్రపతి అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం రాష్ట్రపతి కాన్వాయ్‌నే ఆపేసిన ట్రాఫిక్‌ పోలీస్‌ నిజలింగప్ప అందరి ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి అంతటి వారే దారి ఇవ్వగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోగా, ఆయన భద్రతా సిబ్బంది కారణంగా ఏకంగా రోగిని ఆమె బంధువుల దాదాపు 300 మీటర్ల దూరంలో నడిపించుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఎదురైంది. నేడు మండ్యా జిల్లా నగమంగల ప్రాంతానికి సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్‌ వస్తోంది. అదే సమయానికి అంబులెన్స్‌ కూడా వచ్చింది. అయితే, సీఎం కాన్వాయ్‌ వెళ్లడం కోసం రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి అంబులెన్స్‌ను నిలిపివేయడంతో, వెళ్లనిచ్చేందుకు మార్గాన్ని ఇవ్వాల్సిందిగా ప్రజలు కోరినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. భద్రతా కారణాల దృష్ట్యా వెళ్లనిచ్చేది లేదని చెప్పారు. దీంతో అంబులెన్స్‌లో ఉన్న రోగి బంధువులు నడిపించుకుంటూ ఆసుపత్రికి తరలించారు. సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్‌ కోసం అంబులెన్స్‌ను ఆపడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో ఆయన కాన్వాయ్‌ కోసమని దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌, అంబులెన్స్‌ను నిలిపివేశారు.