టీఎస్‌టీఎస్సీ చైర్మన్ గా రాకేశ్

SMTV Desk 2017-06-12 18:20:18  Telangana State Technical Services Corporation,

హైదరాబాద్, జూన్ 12 : తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ (టీఎస్‌టీఎస్సీ) చైర్మన్‌గా డాక్టర్ చిరుమిల్ల రాకేశ్‌కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించి సాంకేతిక అక్షరాస్యత పెంపునకు కృషిచేస్తానని వెల్లడించారు. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో సాంకేతిక అక్షరాస్యతను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రత్యేక కృషిలో తనవంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. హైదరాబాద్ మరింత ముందడుగు వేసేందుకు సహకరిస్తామని తెలిపి ఈ టీఎస్‌టీఎస్సీ ఆధ్వర్యంలో ఇందుకు అనుకూలమైన విధివిధానాలను రూపొందిస్తామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు టీ హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, జోగురామన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బాల్కసుమన్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులు డాక్టర్ రాకేశ్‌కుమార్‌ను గౌరవ పూర్వకంగా సన్మానించారు.