గవర్నర్‌ తో పాటు అందరు శాఖాహారమే తినాలి!

SMTV Desk 2017-11-21 10:55:22  Banviral Purohit, Governor of Thamilanadu, Rajbhavan Vegetarian

చెన్నై, నవంబర్ 21 : ఇటీవల తమిళనాడు గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టిన బన్వరిలాల్‌ పురోహిత్‌ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌ను శుద్ధ శాకాహార మండలంగా మార్చుతూ చర్యలు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన ఈయన రాజకీయ ఉత్కంఠ పరిణామాలు నెలకొంటున్న సమయంలో రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. అక్టోబరు 6న పదవీ బాధ్యతలు స్వీకరించిన బన్వరిలాల్‌ రాజ్‌భవన్‌ను తనదైన శైలిలో ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను కలవడానికి వచ్చే వారు పూలమాలలు, పుష్పగుచ్ఛాలు, శాలువలు తీసుకురాకూడదని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించడానికి అన్నాడీఎంకే ప్రముఖుడు ఒకరు అనుమతి కోరగా అందుకు గవర్నర్‌ నిరాకరించారు. ప్రస్తుతం గవర్నర్‌ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో పలు సంప్రదాయాల్లో బన్వరిలాల్‌ పురోహిత్‌ మార్పులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రాజ్‌భవన్‌ను శుద్ధ శాకాహార మండలంగా గవర్నర్‌ ప్రకటించారు. రాజ్‌భవన్‌ లోపల, దాని ప్రాంగణంలోని ఇతర ప్రాంతాల్లో ఎవరూ మాంసాహారం తినకూడదని, వండ కూడదని ఆదేశించారు. పనిచేసే సిబ్బంది, అధికారులు, ఉద్యోగులు ఎవరైనా మాంసాహారం తినాలని భావిస్తే బయటకు వెళ్లి తినిరావడానికి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. అలాగే రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను గుర్తించడానికి భాష అడ్డుకాకూడదని భావించి తమిళం నేర్చుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కొత్త గవర్నర్ రాజ్‌భవన్‌ ను ఎన్నో విధాలుగా మారుస్తున్నారు.