స్విస్ బ్యాంకు ఖాతాల సమాచార౦ ఇక సులువు!

SMTV Desk 2017-11-19 18:33:00  Swiss bank accounts details, india, swiss bank

బెర్న్, నవంబర్ 19 : భారతీయుల స్విస్ బ్యాంకు ఖాతాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం తెలుసుకునేందుకు మార్గం సుగమమైంది. ఇరు దేశాలు సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ఇచ్చిపుచ్చుకునేందుకు స్విట్జర్లాండ్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. స్విట్జర్లాండు పార్లమెంటులోని ఎగువ సభకు చెందిన ఆర్థిక వ్యవహారాలు, పన్నుల కమిషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంతో పాటు మరో 40 దేశాలతో స్విట్జర్లాండ్ కుదుర్చుకున్న ఇటువంటి ఒప్పందాలను ఆమోదించింది. అయితే వ్యక్తిగత లీగల్ క్లెయిములకు రక్షణను పటిష్ట పరచాలని సలహా ఇచ్చింది. ఈ సిఫారసులను ఈ నెల 27న జరిగే స్విస్ పార్లమెంటులోని ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆమోదించవలసి ఉంది. దీనికి ఆమోదం లభిస్తే స్విస్ బ్యాంకుల్లో డబ్బు పోగేసుకునేవారి వివరాలు భారత ప్రభుత్వం పొందగలుగుతుంది. బ్యాంకు ఖాతాదారు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, వడ్డీ, డివిడెండ్, బీమా పాలసీల నుంచి వచ్చిన సొమ్ము, క్రెడిట్ బ్యాలెన్స్ వంటి వివరాలను ప్రభుత్వం తెలుసుకోవచ్చు.