భారత రాష్ట్రపతి వేతనం ఎంతో తెలుసా...?

SMTV Desk 2017-11-19 16:00:57  President of India salaries, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 19 : భారత రాష్ట్రపతి, దేశ ప్రధమ పౌరుడు, సర్వసైన్యాధ్యక్షుడు రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక దేశాధినేత కేంద్ర ప్రభుత్వం ప్రకటనలన్నీ రాష్ట్రపతి పేరుమీదే వెలువడుతాయి. అలాంటిది రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వం ఉన్నతోద్యాగుల కంటే తక్కువ వేతనం లభిస్తుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 2016 జనవరి 1 నుంచే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరుగగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాల పెంపు ప్రతిపాదనకు ఏడాదైన మోక్షం లభించటం లేదు. దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగి అయిన కేబినెట్‌ సెక్రటరీ కంటే రాష్ట్రపతి తక్కువ జీతాన్నే తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకు రూ.1.50లక్షలు వేతనం కాగా.. ఉప రాష్ట్రపతి రూ.1.25లక్షలు, రాష్ట్ర గవర్నర్లు రూ.1.10లక్షల వేతనం పొందుతున్నారు. అంతేకాదు, రాష్ట్రపతి వేతనం త్రివిధ దళాధిపతులు(ఆర్మీ, వైమానిక, నేవీ) కంటే కూడా తక్కువ. త్రివిధ దళాధిపతుల నెలవారీ వేతనం కేబినెట్‌ సెక్రటరీతో సమానంగా ఉంటుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాల పెంపు ప్రతిపాదనలను హోంమంత్రిత్వ శాఖ సిద్ధం చేసి మంత్రిమండలి ఆమోదం కోసం కేబినెట్‌ సెక్రటేరియట్‌కు ఏడాది క్రితమే పంపినట్లు హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే దీనిపై కేంద్రం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం, రాష్ట్రపతి నెలకు రూ.5లక్షలు, ఉపరాష్ట్రపతి రూ.3.5లక్షలు, గవర్నర్‌ రూ.3లక్షల వేతనాన్ని పొందనున్నారు.