పాక్ పై గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ ప్రాంత ప్రజల నిరసనలు...

SMTV Desk 2017-11-19 12:01:16  Illicit tax, Gilgit-Baltistan, people Protests pakisthan

ఇస్లామాబాద్‌, నవంబర్ 19 : అక్రమ పన్ను విధానానికి వ్యతిరేకంగా గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ లో పాకిస్థాన్ పై ఆందోళనలు జరుగుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. వ్యాపారస్తులందరూ తమ దుకాణాలను మూసివేశారు. ప్రాంతాన్ని ఆక్రమించుకున్న పాకిస్థాన్ అన్యాయంగా, అక్రమంగా తమపై పన్ను విధిస్తుందని గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. కుటుంబంలో ఐదుగురు సభ్యుల కంటే ఎక్కువగా ఉంటే అదనపు పన్ను విధిస్తున్నారని వాపోయ్యారు. ఇకపై పాకిస్థాన్ కు పన్నులు చెల్లించమని నిర్ణయించారు. తమ ప్రాంతానికి రాజ్యాంగ హోదా కనీస ప్రాధమిక హక్కులు, రాయితీలు కనిపించకుండా తరచుగా వ్యాపారాలపై అధిక పన్నులు వేస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు దుయ్యబట్టారు. అత్యవసర ఆదేశాల ద్వారా పాక్ తమపై ఈ పన్నులు విధిస్తుందని మండిపడ్డారు. గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ లో వివాదాస్పద ప్రాంతంగా పాక్ సుప్రీంకోర్టు ప్రకటించిందని ఇక్కడ పన్నులు విధించే అధికారం పాక్ కు లేదని ఆందోళన కారులు వ్యాఖ్యానించారు. ఈ నిరసనలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.