రాజన్న దర్శనానికి ఎన్ని గంటలో...

SMTV Desk 2017-06-12 12:06:35  Telangana is the largest Saivite field, vemulawada rajanna

వేములవాడ, జూన్ 12 : తెలంగాణలోనే ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఆ పరమశివుడు శ్రీ రాజరాజేశ్వరుడిగా కొలువుదీరాడు. కోరిన మొక్కులు తీర్చే పేదల దేవుడు రాజన్నగా పేరుగాంచాడు. వేసవి సెలవులు ఆదివారంతో ముగుస్తుండటంతో పెద్దసంఖ్యలో స్వామి వారిని దర్శించేందుకు భక్తులు తరలివచ్చారు. రాజన్న దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలన్ని నిండిపోవడంతో భక్తులందరూ గంటల తరబడి వేచి ఉన్నారు. ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు లఘు దర్శనం కల్పించారు. స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. స్వామివారికి ప్రీతి మొక్కైనా కోడెమొక్కులను భక్తులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామచంద్రమూర్తి, అనంత పద్మనాభస్వామి, బాలత్రిపురా సుందరీదేవి ఆలయాల్లో భక్తులు ప్రత్యేకపూజలు చేసుకున్నారు. కళాభవన్ లో సత్యనారాయణ వ్రతాల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.