జేడీయూ పార్టీ నితీశ్‌దే: ఈసీ

SMTV Desk 2017-11-18 14:49:59  ec about jdu party, nithish kumar, ec, bihar updates

న్యూఢిల్లీ, నవంబర్ 18: జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీ గుర్తు బాణం, జేడీయూ పార్టీ కూడా బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌కు చెందుతుందని ఎన్నికల కమిషన్‌(ఈసీ) శుక్రవారం స్పష్టం చేసింది. జేడీయూ పార్టీ తమదేనని, పార్టీ గుర్తు కూడా తమకే కేటాయించాలని కోరుతూ శరద్‌యాదవ్‌, నితీశ్‌కుమార్‌ వర్గీయులు గతంలో ఈసీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరువైపులా నేతల బలాబలాలను పరిశీలించిన ఈసీ బాణం గుర్తు, పార్టీ నితీశ్‌కే చెందుతుందని తెలిపింది. జేడీయూ నేతల్లో ఎక్కువ మంది నితీశ్‌కే మద్దతు తెలపడంతో ఆయనకే పార్టీని, గుర్తును కేటాయిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. బీహార్‌ మహాకూటమి నుంచి సీఎం నితీశ్‌కుమార్‌ విడిపోయి భాజపాతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. భాజపాతో జట్టు కట్టడాన్ని జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. తాను మాత్రం మహాకూటమి నుంచి బయటకు వచ్చేది లేదని అసలైన జేడీయూ తనదేనని శరద్‌యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ గుర్తు బాణంను తమకే కేటాయించాలని యాదవ్‌ వర్గీయులు ఈసీని ఆశ్రయించారు. అయితే ఈసీ నుంచి శరద్ యాదవ్‌కు ఎదురుదెబ్బ తగిలింది.