దివికేగిసిన కవిరత్నం

SMTV Desk 2017-06-12 11:26:11   The famous Sinar passes away, Jnanpith Award recipient, Cinare was a member of the Rajya Sabha

హైదరాబాద్, జూన్ 12 : తెలుగు కవి, సాహితీవేత్త సి.నా.రె.గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (85) కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు, 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే. సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. సినారె అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ బిరుదులతో సత్కరించింది. కాకతీయ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఆంధ్ర, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. భారత రాష్ట్రపతి సినారెను 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసి, ఆరేళ్ళపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి. 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోల్పడుతున్నారు. ఆయన రాజన్న జిల్లాలోని హన్మాజీపేట గ్రామంలో జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు, తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య ఆయన గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో నుంచే హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఎక్కువ ప్రాధాన్యం చూపేవారు. సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు. ఆయన బాల్య వివాహాస్తుడు భార్య సుశీల, నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవే లు ఉన్నారు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు. ఆయన మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, సాహిత్య కళాకారులు, ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.